భారతదేశ ప్రజలమగు మేము...

భారతదేశ ప్రజలమగు మేము...
06-02-2020 00:22:28

రాజ్యాంగాన్ని చదువుదాం. దాని విస్తృతిని, ఔదార్యాన్ని, పరిమితిని కూడా అవగాహన చేసుకుందాం. వాటికి తరువాతి వారు చేసిన సవరణల మంచిచెడ్డలను తెలుసుకుందాం. ఇష్టమొచ్చిన అన్వయాలు ఇచ్చి, వక్రీకరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వాలు ఎట్లా నడిచాయో, ఎట్లా మౌలిక విధానాలనే మార్చాయో విశ్లేషించుకుందాం. రాజ్యాంగ గ్రంథం అట్ట మీద దేవుళ్ల బొమ్మలుండేవని ప్రేలాపనలు పేలే ప్రజాప్రతినిధుల స్థాయిని తెలుసుకుందాం. సమాజంలో చెలరేగుతున్న ప్రతీపధోరణులకు రాజ్యాంగంతోనే చికిత్స చేద్దాం.

బాగా తెలిసిన పుస్తకమే. చాలా సార్లు చూసి ఉంటాను. కొన్ని సార్లు తిరగేసి కూడా ఉంటాను. కొన్ని సార్లు అవసరమైన చోట్ల శ్రద్ధగా చదివి ఉంటాను. కొన్ని భాగాల మీద వ్యాఖ్యలు, విశ్లేషణలు కూడా చేసి ఉంటాను. అనేక సందర్భాలలో ఉటంకించి ఉంటాను. గౌరవించిన పుస్తకమే. అంతగా జీర్ణించుకున్న పుస్తకమో, హత్తుకున్న పుస్తకమో కాకపోయి ఉండవచ్చు. కానీ, ఈ మధ్య నిజామాబాద్‌లో ఒక సదస్సుకు హాజరైనప్పుడు నిర్వాహకులు మెమెంటోగా ఆ పుస్తకం ఇస్తున్నప్పుడు మాత్రం అనిర్వచనీయమైన ఉద్వేగం కలిగింది.

భారత రాజ్యాంగం
ఆ తరువాత హైదరాబాద్‌లో జరిగిన ఒక సాహిత్య సమావేశంలో కూడా అదే మెమెంటోను అందుకున్నప్పుడు అక్కడి వాతావరణంలోనే ఒక ఉద్విగ్నత కనిపించింది. ప్రవేశికను పఠిస్తున్నప్పుడు, విస్మృతంగా అజ్ఞాతంగా ఉండిపోయిన మహోన్నత సంకల్పాన్ని, ఆశయాన్ని పునర్దర్శిస్తున్నట్టు అనిపించింది.

డెబ్భయి రెండేళ్ల కిందట స్వాతంత్య్రం వచ్చినప్పుడు, ఆ సంతోషం ఎంతో రక్తసిక్త విషాదంతో మసకబారి ఉండింది. భారతదేశ ప్రజ తమను తామొక, ఒకే ఒక జాతిగా తీర్చిదిద్దుకోగలరా, తమలోని విభిన్నతను ఆరోగ్యకరమైన వైవిధ్యంగా నిర్వహించుకోగలరా, నిరక్షరాస్యత, భూస్వామ్యం, మూఢత్వం, స్వార్థం, కులోన్మాదం, మతతత్వం గూడుకట్టుకుని ఉన్న ఒక సమాజం సొంతంగా, ప్రగతిశీలంగా ముందుకు నడవగలదా అన్న అనుమానాలు. స్వతంత్రత నుంచి గణతంత్రతకు మూడేళ్ల ప్రయాణం. భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి, సమాజపు ప్రతినిధులంతా కూర్చుని, చర్చించి, ప్రస్థానానికి కావలసిన పునాదిని నిర్మించుకున్నారు. భారతదేశపు పురోగతికి ఒక అభ్యుదయ మార్గాన్ని రచించి, ప్రయాణాన్ని ఉన్నత ఆదర్శాలకు, ఆశయాలకు బద్ధం చేసిన వాడు బాబాసాహెబ్‌ భీంరావ్‌ రాంజీ అంబేడ్కర్‌. పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు, కాలం చెల్లిన విలువలకు, అనవసరపు గందరగోళానికి ప్రాతినిధ్యం వహించే అనేకానేక ప్రతిపాదనలను కాచి, వడబోసి, ఆధునిక ప్రజాస్వామిక విలువల నైతికతను జోడించి రాజ్యాంగ సూత్రాలను ఖరారు చేసినవాడు అంబేడ్కర్‌.

కొందరు భావిస్తున్నట్టు, రాజ్యాంగపు రాయసకాడు కాదు. ఆయన భారతరాజ్యాంగానికి తీర్పరి, కూర్పరి, మార్గదర్శి, దానికొక నైతికతను ప్రామాణికతను అందించిన స్మృతికారుడు. అంబేడ్కర్‌ తాను స్వీయరచనగా మాత్రమే ఒక నమూనా రాజ్యాంగాన్ని రాయవలసివస్తే, అది ఇప్పుడున్న రాజ్యాంగం కంటె ఎంతో మెరుగుగా ఉండేది. తాను సమర్పించిన రాజ్యాంగ పాఠ్యంపై అంబేడ్కర్‌కు పూర్తి ఏకీభావంకానీ, సంతృప్తికానీ లేదు. అయితే, ఆయన తనకు అప్పగించిన బాధ్యత మేరకు, ఒక సామాజిక విప్లవకారునిగా తన కర్తవ్యం మేరకు పరిమితులకు లోబడి, ఉత్తమమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. ఆయనకే అవకాశం ఉండి ఉంటే, ఆస్తిహక్కుకు ఎంతో కొంత పగ్గం వేసి ఉండేవారేమో? సామాజిక న్యాయానికి సంబంధించి ప్రవేశికలోనూ, ఆదేశికసూత్రాలలోను పేర్కొన్నదానికి, రిజర్వేషన్ల వంటి సానుకూల వివక్షలకు మించిన ప్రతిపాదనలు చేసి ఉండేవారేమో? రాజ్యాంగం కరదీపికగా ఉన్నప్పటికీ, అనేక చట్టాలలో ఉన్న వివక్షను ఆయన గమనించారు. హిందూకోడ్‌ బిల్లుపై ఆయన పట్టింపు అటువంటి వివక్షను తొలగించడానికే. రాజ్యాంగం అనేక కర్తవ్యాలను తన పీఠిక ద్వారా, ఆదేశిక సూత్రాల ద్వారా భవిష్యత్తుకు వదిలివేసింది. వాటిని తరువాతి తరాలు ముందుకు తీసుకు వెళ్లాలని, అప్పటికి కానీ రాజ్యాంగ లక్ష్యం సంపూర్ణం కాదని అంబేడ్కర్‌కు తెలుసు.

అంబేడ్కర్‌ సిద్ధాంతాలకు ఆదరణ, ప్రాచుర్యం పెరుగుతున్న కారణంగా రాజ్యాంగానికి కొత్త గౌరవం లభిస్తున్నదా? అది కూడా ఒక కారణమే. కాదనలేము. దళిత, బహుజన శ్రేణులు అంబేడ్కర్‌ తమకు ఇతరత్రాను, రాజ్యాంగం ద్వారానూ చేసిన మేళ్లను, కల్పించిన హక్కులను సగౌరవంగా స్మరించుకోవడం సహజం. ఆ హక్కులకు, ప్రయోజనాలకు నెలవుగా ఉన్న రాజ్యాంగాన్ని ఆరాధించడం సహజం. ఆ ప్రేమాభిమానాలతో పాటు, కొద్దికాలంగా, రాజ్యాంగాన్ని తిరిగి అధ్యయనం చేసి, దాని స్ఫూర్తిని గుర్తుచేస్తున్నవారు, రాజ్యాంగ నైతికతను ఒక ఉన్నత విలువగా ప్రతిపాదిస్తున్నవారు పౌరసమాజంలో పెరుగుతున్నారు. ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి ఎడంగా జరుగుతున్న కొద్దీ, రాజ్యాంగాన్ని ఆశ్రయించవలసి రావడం సహజం. గత ఆరేళ్ల కాలంలో, జాతీయస్థాయిలో రాజ్యాంగ స్ఫూర్తికి, మౌలిక భావనలకు ప్రమాదం తీవ్రస్థాయిలో పెరిగినందువల్ల కూడా తరచు రాజ్యాంగ పాఠ్యంలోకి తొంగిచూడవలసి వస్తున్నది.

రాజ్యాంగ స్ఫూర్తికి, ఆశయాలకు, రాజ్యాంగాంశాలకు ఉల్లంఘనలు పెరుగుతున్న క్రమంలో, ప్రజాస్వామిక ఉద్యమాలు రాజ్యాంగాన్నే ఆయుధంగా ధరించవలసి వస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతున్న పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమంలో భారత రాజ్యాంగమే పతాకం, రాజ్యాంగ ప్రవేశికే నినాదం. దళిత, మైనారిటీ ఐక్య ఉద్యమాన్ని నిర్మిస్తున్న చంద్రశేఖర్‌ ఆజాద్‌ ‘రావణ్‌’ ఒక చేత్తో త్రివర్ణ పతాకాన్నీ, మరో చేత్తో రాజ్యాంగాన్నీ ధరించి ఢిల్లీ జామామసీద్‌లో తెలిపిన నిరసన చరిత్రాత్మకమైనది. షహీన్‌బాగ్‌లో, జామియా మిలియా కేంపస్‌ దగ్గర ఆందోళనకారులు, ఉద్యమకారులు అందరూ మువ్వన్నెల పతాకాలనే చేతపడుతున్నారు. యువకులు రాజ్యాంగాన్ని, భారతీయ జెండాను ధరించడం ఒక మోసమని, ఈ దేశ ప్రధాని వ్యాఖ్యానించడం, అందులోనూ ఒక రాష్ట్ర ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యానించడాన్ని ఏమనగలం?

స్వాతంత్య్రం వచ్చిన తరువాత పరిస్థితులు త్వరితగతిని మెరుగుపడకపోవడం, ఆశాభంగాన్నే కలిగించింది. అంతకు ముందు నుంచే కాంగ్రెస్‌ తరహారాజకీయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నవారు ఎట్లాగూ ప్రతిపక్షంగా వ్యవహరించారు. తీవ్ర ఆచరణలను ఎంచుకున్నవారు దేశ స్వతంత్రతను విశ్వసించేవారు కాదు, రాజ్యాంగాన్నీ పెద్దగా లెక్కలోకి తీసుకునేవారు కాదు. రాజ్యాంగ యంత్రాన్ని వ్యతిరేకించడం వేరు, రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం వేరు. ఎన్నికల దగ్గర నుంచి ప్రభుత్వంతో ప్రమేయం ఉన్న ప్రక్రియలన్నిటిని నిరాకరించడం ఒక వైఖరిగా కొన్ని రాజకీయ మార్గాలలో ఉన్నది, ఉంటున్నది. కానీ, కొత్తగా విద్యావంతులైన దళిత, బహుజన శ్రేణులు, ఔత్సాహికులైన ఇతరులు పాలనా ప్రక్రియల్లో, అభివృద్ధిలో భాగస్వామ్యం కోరుతున్నారు. ఎన్నికల ద్వారా సాధికారత లభిస్తుందని ఆశిస్తున్నారు. బహిరంగంగా చేయగల ప్రజాస్వామిక ఆందోళనల ద్వారా వ్యతిరేకులలో స్పందన తేగలమని నమ్ముతున్నారు.

వీరందరివీ భ్రమలు మాత్రమే అనలేము. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో స్వాయత్తం చేసుకుని తామనుకునే న్యాయం వైపు ప్రయాణించాలని సాగుతున్న ప్రయత్నాలన్నిటికీ భారతరాజ్యాంగం నుంచే స్ఫూర్తి లభిస్తున్నది. ‘‘సామాజిక, ఆర్థిక, రాజకీయ– న్యాయాన్ని, ఆలోచనల్లో స్వేచ్ఛను, భావప్రకటనా స్వేచ్ఛను, విశ్వాసంలో, ధార్మికతలో, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్థులోను, అవకాశంలోను సమానత్వాన్ని’’ పెంపొందించేందుకు సత్యనిష్ఠాపూర్వకంగా తీర్మానించుకుని భారతప్రజలు తమకు తాము సమర్పించుకున్న రాజ్యాంగం లోని శక్తిని ఇప్పటి తరం ఆవాహన చేసుకుంటున్నది. వారి ప్రయత్నం వారిని చేయనిద్దాం. బహుశా, ఈ సారి విశాల ప్రజానీకం ఈ ప్రయత్నంలో భాగస్వాములవుతారు. ప్రజాస్వామ్యాన్ని తమవైపు నుంచి సాధన చేస్తారు.

రాజ్యాంగాన్ని చదువుదాం. దాని విస్తృతిని, ఔదార్యాన్ని, పరిమితిని కూడా అవగాహన చేసుకుందాం. వాటికి తరువాతి వారు చేసిన సవరణల మంచిచెడ్డలను తెలుసుకుందాం. ఇష్టమొచ్చిన అన్వయాలు ఇచ్చి, వక్రీకరణలు చేసి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రభుత్వాలు ఎట్లా నడిచాయో, ఎట్లా మౌలిక విధానాలనే మార్చాయో విశ్లేషించుకుందాం. రాజ్యాంగ గ్రంథం అట్ట మీద దేవుళ్ల బొమ్మలుండేవని ప్రేలాపనలు పేలే ప్రజాప్రతినిధుల స్థాయిని తెలుసుకుందాం. సమాజంలో చెలరేగుతున్న ప్రతీపధోరణులకు రాజ్యాంగంతోనే చికిత్స చేద్దాం.


కె. శ్రీనివాస్

Comments

Popular posts from this blog

Mitākṣarā - "inheritance by birth."

Hindu code bills